తీర్పులు అనుకూలంగా రాకపోతే న్యాయమూర్తులపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం ఒక ప్రమాదకర ధోరణిగా మారిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌషుమి భట్టాచార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎన్. పెద్ది రాజుపై జరిగిన కోర్టు ధిక్కరణ కేసు విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సీజేఐ గవాయ్ మాట్లాడుతూ, “న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత. శిక్షించడం కంటే క్షమించడం చట్టం యొక్క మహిమ” అని అన్నారు.
పెద్ది రాజు కోర్టుకు క్షమాపణ చెప్పగా, న్యాయమూర్తి దానిని స్వీకరించడంతో కేసు ముగిసింది. అయితే సీజేఐ న్యాయవాదులను హెచ్చరిస్తూ, “న్యాయమూర్తులపై ఆరోపణలు చేసే పిటిషన్లపై సంతకం చేసేముందు జాగ్రత్తగా ఉండాలి” అని సూచించారు.
ఈ ఘటన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేసుతో సంబంధం కలిగి ఉందని తెలిసింది. నవంబర్ 23న పదవీ విరమణ చేయబోతున్న సీజేఐ గవాయ్, న్యాయవ్యవస్థ గౌరవం కాపాడటానికి ఇలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు.

