హైదరాబాద్ సీబీఐ కోర్టు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) దాఖలు చేసిన వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్పై సీబీఐ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను రేపటికి వాయిదా వేసింది.
జగన్ ఇటీవల యూరప్ పర్యటనకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, పర్యటన అనంతరం నవంబర్ 14లోగా వ్యక్తిగతంగా హాజరై వివరాలు ఇవ్వాలి అనే షరతు విధించింది. ఈ షరతు నుంచి మినహాయింపు ఇవ్వాలని, లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకు అనుమతివ్వాలని జగన్ పిటిషన్లో కోరారు.
తాను కోర్టుకు వస్తే భద్రతా ఏర్పాట్ల కోసం ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తుతాయని జగన్ పేర్కొన్నారు. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడైన జగన్, యూరప్ పర్యటన అనంతరం కోర్టు హాజరు ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని గత గురువారం మెమో దాఖలు చేశారు.
గతంలో సీబీఐ కోర్టు, అక్టోబర్ 1 నుంచి 30 మధ్య 15 రోజులపాటు యూరప్ పర్యటనకు అనుమతి ఇచ్చి, వెళ్లే ముందు పర్యటన వివరాలు, ఫోన్ నంబరు, ఈమెయిల్ వివరాలు సమర్పించాలని ఆదేశించింది.

