మొంథా తుపానుతో రాష్ట్రానికి రూ.6,384 కోట్ల నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తుపాను నష్టంపై అంచనాకు వచ్చిన కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పాసుమీ బసు నేతృత్వంలోని బృందంతో సీఎం సమావేశమయ్యారు.
ఇళ్లకు, రహదారులకు, విద్యుత్ స్తంభాలకు, పంటలకు, ఆక్వా, చేనేత రంగాలకు భారీ నష్టం జరిగిందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 443 మండలాల్లోని 3,109 గ్రామాలు ప్రభావితమయ్యాయని, దాదాపు 10 లక్షల మంది తుపానుతో బాధపడ్డారని తెలిపారు.
నష్టపోయిన ప్రజల కోసం 1.92 లక్షల మందిని రిలీఫ్ క్యాంపులకు తరలించగా, 3.36 లక్షల కుటుంబాలకు రూ.3 వేల చొప్పున ఆర్థిక సాయం అందించినట్లు చెప్పారు. రహదారులు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు తక్షణ సాయంగా రూ.2,622 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర బృందాన్ని సీఎం కోరారు.
రాష్ట్ర విపత్తు నిధులు గత పాలకులు ఖాళీ చేశారని విమర్శించిన సీఎం, కేంద్రం ఉదారంగా సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీజీఎస్ వ్యవస్థ ద్వారా నష్టాన్ని తగ్గించగలిగారని కేంద్ర బృందం సీఎం చంద్రబాబును అభినందించింది.


