టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డే కెరీర్‌పై కొనసాగుతున్న చర్చకు తెరపడింది. జట్టులో కొనసాగాలంటే దేశవాళీ క్రికెట్ ఆడడం తప్పనిసరి అని బీసీసీఐ స్పష్టం చేసింది. టెస్టులు, టీ20ల నుంచి తప్పుకున్న ఈ ఇద్దరు ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్‌కే పరిమితమయ్యారు.
వారి మ్యాచ్ ఫిట్నెస్ను అంచనా వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 24 నుంచి ప్రారంభమయ్యే విజయ్ హజారే ట్రోఫీలో వీరిద్దరూ ఆడాలని సూచించింది. రోహిత్ ఇప్పటికే ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)కు తన అందుబాటును తెలియజేశాడు. అయితే, కోహ్లీ ఇంకా స్పందించలేదు.
“జాతీయ జట్టులో ఆడాలంటే దేశవాళీ క్రికెట్లో పాల్గొనడం తప్పనిసరి” అని బీసీసీఐ అధికారి పేర్కొన్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం తెలిపింది. రోహిత్ నవంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో కూడా ఆడేందుకు సిద్ధమని సమాచారం.
బీసీసీఐ ఈ చర్యను 2027 వన్డే ప్రపంచకప్ దృష్టిలో ఉంచుకుని చేపట్టింది. ఆటగాళ్లు విరామం తర్వాత ఫామ్ కోల్పోకుండా ఉండటానికి దేశవాళీ క్రికెట్ ఉత్తమ మార్గమని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పేర్కొన్నారు.
ఇటీవల ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ సెంచరీతో మెరిసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలవగా, కోహ్లీ 74 పరుగులు చేశాడు. ఇప్పుడు వారి భవిష్యత్తు దేశవాళీ ప్రదర్శనపై ఆధారపడి ఉందని స్పష్టమవుతోంది.

