పెన్షనర్లకు సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మీసేవా ప్లాట్‌ఫారమ్ ద్వారా అందుబాటులో ఉన్న డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ (PLCS) సేవతో, పెన్షనర్లు ఇకపై బ్యాంకులు లేదా ట్రెజరీ కార్యాలయాలకు వెళ్లకుండా ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు అని ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు తెలిపారు.
ఈ సేవ టెక్నాలజీ ఆధారిత పారదర్శక పాలనకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకు 1.09 లక్షలకుపైగా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2.7 లక్షలకుపైగా పెన్షనర్లు ఈ సదుపాయంతో లాభపడుతున్నారు.
మీసేవా యాప్‌లో ఆధార్ ఆధారిత ముఖ ధృవీకరణ వ్యవస్థ ద్వారా గుర్తింపు పూర్తయిన వెంటనే సర్టిఫికేట్ ఆటోమేటిక్‌గా ప్రభుత్వ రికార్డుల్లో అప్డేట్ అవుతుంది. ఈ సౌకర్యంతో పెన్షనర్లకు*ప్రయాణం, క్యూలైన్లు, కాగితపనులు అన్నీ తొలగిపోయాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం మీసేవా ద్వారా 300కి పైగా ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉన్నాయి.

