మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలోని హిందుస్థాన్ కోకోకోలా బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్లో కార్మికులు గురువారం నిరసన చేపట్టారు. క్యాంటీన్లోనాసిరకం భోజనం, భద్రతా ప్రమాణాల లోపం, అధిక పని భారం కారణంగా సమస్యలు తీవ్రమయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు నాగళ్ల శ్రీధర్, గౌరవాధ్యక్షుడు రఘుపతుల రామ్మోహనరావు, ప్రధాన కార్యదర్శి వలివేటి ఆదినారాయణ మాట్లాడుతూ — “గత ఆరు నెలలుగా అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవు. కార్మికులు అనారోగ్యానికి గురవుతున్నారు” అని పేర్కొన్నారు.
యాజమాన్యం నిర్లక్ష్యంతో ప్రమాదాలు పెరుగుతున్నాయని, శిక్షణ లేకుండా ఫ్రెషర్లను యంత్రాలపై పనిచేయించడం వల్ల పలువురు గాయపడ్డారని తెలిపారు. తక్షణం నాణ్యమైన ఆహారం, భద్రతా చర్యలు, పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ నిరసనలో వందలాది మంది కార్మికులు పాల్గొన్నారు.
