రాష్ట్ర రాజధాని ప్రాంతంలోని రైతులకు ఇచ్చిన అన్ని హామీలను 100% అమలు చేస్తామని మున్సిపల్ పరిపాలన మంత్రి పి. నారాయణ మరోసారి స్పష్టం చేశారు. రాజధాని గ్రామాలైన వెంకటపాలెం, ఉద్దండరాయినిపాలెంలో సిటీస్ ప్రాజెక్ట్ కింద ఉన్న హెల్త్ సెంటర్లు, అంగన్వాడీలు, స్కూళ్లను ఆయన పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న 15 అంగన్వాడీలు, 14 పీఎచ్‌సీలు, 14 స్కూళ్లు, మల్టీపర్పస్ స్మశానవాటిక పనుల పురోగతిని అధికారులు వివరించారు.
రైతులతో ఎవరూ అవహేళనగా మాట్లాడలేదని, ఏ సమస్య ఉన్నా సీఆర్డీఏ కార్యాలయంలో ఎప్పుడైనా అందుబాటులో ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. లంక భూములకు ఎన్జీటీ అనుమతులు అవసరమని, కొందరు రైతులు కోరుకున్న చోటే ఫ్లాట్లు ఇవ్వాలనే డిమాండ్ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు.
రాజధానిలో మౌలిక వసతుల పనులు వేగవంతంగా సాగుతున్నాయని, ఇప్పటివరకు 29,421 మంది రైతులకు 61,433 ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని తెలిపారు. ఇంకా 2,270 మంది రైతులకు 7,988 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని, రోజుకు 30–40 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని వివరించారు. కోర్టు కేసులు, కుటుంబ తగాదాల కారణంగా కొంతమంది రైతుల ఫ్లాట్లు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.
అనవసర ప్రచారాలతో రైతులను గందరగోళానికి గురిచేయవద్దని హెచ్చరిస్తూ, రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని, మూడు సంవత్సరాల్లో రాజధాని పనులు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ పునరుద్ఘాటించారు.
