మ్యూజిక్ కంపెనీ ప్రారంభిస్తున్న మంచుమనోజ్

November 23, 2025 6:20 AM

నటుడు మంచు మనోజ్ ఇటీవల కొన్ని వివాదాల్లో ఇరుక్కొన్న సంగతి తెలిసిందే. వాటికి దూరంగా కొత్త ఆలోచనలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఒక వైపు నటుడుగా రాణిస్తూనే, మరో వైపు సంగీత ప్రపంచంలోకి అరంగేట్రం చేస్తున్నారు. ‘మోహన రాగ మ్యూజిక్’ పేరుతో ఓ కొత్త సంస్థను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ సంస్థ ద్వారా కొత్త ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు తెలిపారు. ఈ కొత్త సంస్థ పేరు వెనుక కూడా ఒక ప్రత్యేకత ఉంది. తనకూ, తన తండ్రి డా. మోహన్ బాబుకూ అత్యంత ఇష్టమైన ‘మోహన రాగం’ పేరునే కంపెనీకి పెట్టారు.

దీనికి ఒక కారణం కూడా ఉంది. మనోజ్‌కు సంగీతంతో ఎప్పటినుంచో బలమైన అనుబంధం ఉంది. గతంలో ‘పోటుగాడు’ చిత్రంలో ఆయన పాడిన ‘ప్యార్ మే పడిపోయానే’ పాట పెద్ద హిట్ అయింది. అంతేకాకుండా ‘మిస్టర్ నూకయ్య’, ‘నేను మీకు తెలుసా’ వంటి చిత్రాలకు గేయ రచయితగానూ పనిచేశారు. తన కుటుంబ సభ్యుల చిత్రాలకు సంగీత విభాగంలో పనిచేయడమే కాకుండా హాలీవుడ్ చిత్రం ‘బాస్మతి బ్లూస్’కు సైతం సంగీత దర్శకుడు అచ్చు రాజమణితో కలిసి పనిచేశారు. కొత్త ఆలోచనలతో, ప్రయోగాత్మక సంగీతాన్ని ప్రోత్సహిస్తూ, భారతీయ సంగీతాన్ని అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లడమే ‘మోహన రాగ మ్యూజిక్’ ప్రధాన లక్ష్యమని మనోజ్ పేర్కొన్నారు.

మొత్తం మీద మంచు మనోజ్ ఉద్దేశ్యాలు, లక్ష్యాలను అంతా మెచ్చుకొంటున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media