మావోయిస్టు నాయకుడు మడివి హిడ్మా సహా ఇతర నాయకుల మరణం జరిగిన మారేడ్ మిల్లి ఎన్‌కౌంటర్ బూటకమని ఆరోుతూ CPI ML మాస్ లైన్ ప్రజాపంథా ఆధ్వర్యంలో గోదావరిఖనిలో నిరసన సభ జరిగింది.
డివిజన్ కార్యదర్శి తోకల రమేష్, జిల్లా నాయకులు ఈసంపల్లి రాజేందర్, కోడిపుంజుల లక్ష్మి మాట్లాడుతూ— నవంబర్ 15న హిడ్మా సహా ఆరుగురు మావోయిస్టులను పట్టుకుని చిత్రహింసలకు గురిచేసి చంపినట్లు కుటుంబ సభ్యులు మరియు ప్రజా సంఘాల వివరాలు చెప్తున్నాయని అన్నారు. రెండు సంవత్సరాలుగా ఆపరేషన్ కగార్ పేరిట జరిగిన 84 ఎన్‌కౌంటర్లలో 780 మందికి పైగా హతమైందని పేర్కొన్నారు.

మావోయిస్టు సమస్యను చర్చలతో పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే కానీ, ఎన్‌కౌంటర్ల పేరిట హత్యలు జరపడం రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ఆదివాసీలను అణచివేస్తున్నారని, పేసా చట్టం, అటవీ హక్కుల చట్టం, షెడ్యూల్ ప్రాంత హక్కులు అమలుపరచకుండా అణచివేత కొనసాగుతున్నదని అన్నారు.
నవంబర్ 18–19 ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని, సంబంధిత పోలీసు అధికారులపై హత్య కేసులు నమోదు చేయాలని, ఆపరేషన్ కగార్‌ను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దండకారణ్యం నుండి సాయుధ బలగాలను వెనక్కి తీసేయాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు ప్రారంభించాలని కేంద్రాన్ని కోరారు.
ప్రజాస్వామ్యంపై దాడి చేసే విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్య ఉద్యమాలకు సిద్ధమవాలని పిలుపునిచ్చారు.
సభలో గుమ్మడి వెంకన్న, గొల్లపల్లి చంద్రయ్య, పుల్లూరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
