రాష్ట్ర రహదారుల అభివృద్ధికి, ఏపీ లింక్ (AP-Link) సంస్థను ఆర్థికంగా బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సచివాలయంలో రహదారులు–భవనాల శాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
పాత్‌హోల్–ఫ్రీ రోడ్లను ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యంగా చూస్తుందని సీఎం స్పష్టం చేశారు. రోడ్ల నిర్మాణం, నిర్వహణలో నాణ్యత ప్రమాణాలు తప్పకుండా పాటించాలని, నాణ్యతలో రాజీ పడే కాంట్రాక్టర్లను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంజనీర్లు కూడా పూర్తి జవాబుదారీతనం తో పనిచేయాలని సూచించారు.
రహదారి పరిస్థితులపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ కోసం డ్రోన్లు, లైడార్, శాటిలైట్ సర్వేలను వినియోగించాలని సీఎం సూచించారు. మొంథా తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిల పునరుద్ధరణను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
పీపీపీ విధానంలో చేపట్టే రోడ్ల జాబితాను వెంటనే సిద్ధం చేయాలని, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అవసరాలపై అధ్యయనం చేయాలని తెలిపారు. నేషనల్ హైవే ప్రాజెక్టులలో జాప్యం లేకుండా కేంద్రంతో సమన్వయం కొనసాగించాలని ముఖ్యమంత్రి సూచించారు.
సమీక్షకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఆర్ అండ్ బి, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
