రాష్ట్రంలోని పంటలకు ఎలాంటి ధరల సమస్యలు రాకుండా, రైతులకు నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సచివాలయంలో వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.

ధాన్యం కొనుగోళ్లలో చెల్లింపులు రెండు రోజుల్లో పూర్తిచేయాలని, దీనికి అవసరమైన నిధులపై ఆర్థికశాఖతో సమన్వయం చేయాలని సీఎం సూచించారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో గోనె సంచుల సరఫరాలో ఎలాంటి లోపాలు ఉండకూడదని ఆదేశించారు.
పత్తి కొనుగోళ్లలో సీసీఐ కొత్త విధానాల వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియడంతో, సమీక్ష సమావేశం నుంచే కేంద్ర టెక్స్‌టైల్స్ శాఖ కార్యదర్శి నీలం రావుకు సీఎం స్వయంగా ఫోన్ చేసి సమస్యను వివరించారు. పత్తి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
అరటి, జొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్థానిక ట్రేడర్లు, ఎగుమతిదారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లపై రైస్ మిల్లర్లతో కూడా సమన్వయం కొనసాగించాలని సీఎం ఆదేశించారు.
వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, వర్షాల వల్ల పంటలకు నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
సమీక్షలో వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
