సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రిలో డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యపూరిత వైఖరి తీవ్ర వివాదానికి దారితీసింది. పురిటినొప్పులతో వచ్చిన ఓ గర్భిణి పట్ల డాక్టర్ దురుసుగా ప్రవర్తించడం కలకలం సృష్టించింది.
బెల్లంకొండ గ్రామానికి చెందిన షేక్ అస్మా (24), పురిటి నొప్పులతో ఈ నెల 2వ తేదీన ఆసుపత్రికి వచ్చింది,డ్యూటీలో ఉన్న డాక్టర్ అరుణ ఆసుపత్రికి హాజరుకాకుండానే, ఫోన్లో బాధితురాలి కుటుంబ సభ్యులతో దురుసుగా మాట్లాడారు.
“వైద్యులకు సంబంధం లేదని రాసిస్తేనే ఆపరేషన్ చేస్తానని” డాక్టర్ అరుణ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి, వారిని భయభ్రాంతులకు గురిచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఫోన్ సంభాషణ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చేసేదేమీ లేక, బాధితురాలి కుటుంబ సభ్యులు ఆమెను పిడుగురాళ్లలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందిన అస్మా, ఆమె బిడ్డ క్షేమంగా ఉన్నట్లు సమాచారం
