National :ARUNACHALA శివఅద్భుత జ్యోతి దర్శనం

December 4, 2025 6:57 PM

ఈ మధ్యకాలంలో తెలుగు నాట అరుణాచలం పేరు మార్మోగిపోతోంది. ప్రతీ రోజూ వేల సంఖ్యలో తెలుగు భక్తులు అరుణాచలం దర్శిస్తున్నారు. గిరి ప్రదక్షిణ చేసుకొంటున్నారు. ఇక, ఏడాదికి ఒకసారి జరిగే భరణీ దీపం కోసం తెలుగు భక్తులు తండోపతండాలుగా వెళుతున్నారు. ఈ ఏడాది భరణీ దీపం ను నిన్న బుధవారం రాత్రి నిర్వహించారు. లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులతో తిరువన్నామలై పట్టణం కిక్కిరిసిపోయింది.

ఇప్పుడు భరణీ దీపం ప్రత్యేకతలు తెలుసుకొందాం. పదహారువందల అరవైఏడు అడుగుల కొండపై కార్తీక దీపోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రధాన ఘట్టమైన మహా దీపోత్సవమైన అఖండజ్యోతి ప్రజ్వలన జరిగింది. అంతకుముందు ఆలయంలో భరణి దీపం వెలిగించారు. అనంతరం సాయంత్రం అఖండజ్యోతిని వెలిగించారు. అదేరోజు రాత్రి ఉత్సవంలో భాగంగా పంచమూర్తులను బంగారు వృషభ వాహనంలో ఊరేగించారు. అయితే అఖండ జ్యోతిని వెలిగించడానికి ఉపయోగించే ప్రమిదను రాగితో చేస్తారు. ఇందులో వత్తిగా వెలిగించే వస్త్రమే 600 మీటర్లు ఉంటుంది. అయితే వీటిని ప్రతి ఏడాది.. జ్యోతి నాడార్ వంశీయులు మాత్రమే అందజేస్తారు. అయితే, ఈ అఖండ జ్యోతి వెలిగేందుకు 2వేల 500 కిలోల నెయ్యిని భక్తులు అందజేశారు. అలా అరుణాచల మహా దీపం మూడు రోజులు దేదీప్యమానంగా వెలుగుతుంది. అంతేకాదు సుమారు 24 కిలోమీటర్ల మేర… ఈ దీపం దర్శనమిస్తుంది.

అరుణాచలం స్వయంగా జ్యోతిర్మయ మహాలింగం కావడంతో.. కార్తిక పౌర్ణమినాడు చేసే మహాదేవ అగ్నిలింగ ప్రదక్షిణకు ఇక్కడెంతో ప్రాధాన్యం ఉంది. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గంలో అనేక ఆలయాలు, ఆశ్రమాలు, బృందావనాలు దర్శనమిస్తాయి. వీటికింత పేరు వచ్చేందుకు ప్రధాన కారణం… అద్వైత గురువు.. భగవాన్‌ రమణమహర్షి అని చెబుతారు. అందుకే ఇక్కడ ప్రదక్షిణ చేస్తే, సాక్షాత్తు కైలాసంలో కొలువుతీరిన శివపార్వతులకు చేసినట్టేనని అన్నారు. అరుణాచలాన్నే తన ఆవాసంగా చేసుకున్న మహర్షి.. ఈ క్షేత్రాన్ని ఇలకైలాసంగా అభివర్ణించారు.

మహాదీపోత్సవ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతంగాలుగా తరలివచ్చారు. ఇక్కడ శివుడిని అన్నామలైయార్ లేదా అరుణాచలేశ్వరునిగా, అమ్మ పార్వతీదేవిని.. ఉన్నములై అమ్మన్ గా పిలుస్తారు. ఇది ప్రపంచంలో ఉన్న టాప్ శివాలయాల్లో ఒకటని చెబుతారు. తిరువణ్ణామలైలో వెలిగించే కార్తీక మహా దీపోత్సవాన్ని వీక్షించే వారికి 21 తరాల మోక్షం లభిస్తుందని అంటారు. ఇలాంటి ఎన్నో నమ్మకాలు అక్కడ భక్తులలో ఉన్నాయి.

ఇకపోతే అరుణాచలంలో కార్తీక దీపోత్సవం సందర్భంగా 5 రకాల దీపాలను వెలిగిస్తారు. ఒకటి భరణి దీపం, రెండు అన్నామలైయార్ దీపం, మూడు విష్ణు దీపం, నాలుగు కార్తీక దీపం, అయిదవది తోటక్ కార్తీక దీపం. ఈ మహాదీపోత్సవం నాడు మహా శివుడు అగ్నిలో నృత్యం చేస్తాడని అంటారు. అందుకే ఈ నృత్యాన్ని ముక్తి నృత్యం అని అంటారు.

వారం పది రోజుల పాటు ఈ భరణీ దీపం వెలుగుతూనే ఉంటుంది. అందుచేత ఈ వారం రోజులు అరుణాచలం క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోవటం ఖాయం.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media