జిల్లాలోని పారిశుద్ధ్య కార్మికులు మరియు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక దంత వైద్య క్యాంపుల ద్వారా ఉచిత వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రభుత్వ దంత వైద్యుల బృందాన్ని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రణాళికను తక్షణమే రూపొందించాలని ఆమె సూచించారు.

కరీంనగర్ కార్పొరేషన్, అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లోని పారిశుద్ధ్య కార్మికులు, మల్టీ పర్పస్ వర్కర్లకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలి. కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, మోడల్ స్కూల్స్, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు సహా అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ దశలవారీగా దంత వైద్య పరీక్షలు నిర్వహించాలి. దంత సమస్యలు ఎక్కువగా ఉన్న వారిని గుర్తించి, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉచితంగా తదుపరి చికిత్స అందజేయాలని ఆదేశించారు.

క్యాంపుల నిర్వహణ కోసం జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల నుండి దంత వైద్య సిబ్బందిని డిప్యూటేషన్ ద్వారా వినియోగించుకోవాలని తెలిపారు.సమావేశంలో ప్రభుత్వ దంత వైద్య అధికారులు రవి ప్రవీణ్ రెడ్డి, రణదీప్, ప్రవీణ్, రాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

