తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కె. కవిత ఆలియాబాద్‌లో నిర్వహించిన ‘జాగృతి జనం బాట’ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన రాజకీయ ప్రయాణం సవాళ్లతో కూడుకున్నదని చెబుతూనే, ప్రజలకు మేలు చేసే విషయంలో విజయం సాధిస్తానని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

“నా బాట పూల బాట కాదు, ముళ్ల బాటే అయినప్పటికీ, మీ ఆశీర్వాదంతో ప్రజలకు మేలు చేయడంలో కచ్చితంగా విజయం సాధిస్తాను” అని కవిత అన్నారు. జాగృతి సంస్థ స్థాపించి 19 ఏళ్లు పూర్తయ్యిందని, నాటి నుంచీ కాళ్లకు బలపం కట్టుకుని తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ఊరూరా తిరిగి వివరించానని గుర్తు చేసుకున్నారు.
తాను గతంలో బీఆర్ఎస్ కోసం పనిచేసినా, ప్రస్తుతం ఆ పార్టీ నుంచి తీసేసినప్పటికీ, ఆడబిడ్డలు, యువమిత్రుల కోసం పనిచేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
తాము ఇప్పుడు ఓట్ల కోసం కాకుండా, కేవలం ప్రజల సమస్యలు వినేందుకు, వాటిని పరిష్కరించేందుకే రాష్ట్రమంతా తిరుగుతున్నామని వివరించారు. “అడిగేటోళ్లు ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయి” అని ఆమె అన్నారు.
