అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్, ఏఎండీ (AMD) సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగం) వంశీ బొప్పనతో భేటీ అయ్యారు.

విజనరీ నాయకుడు చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా రూపుదిద్దుకుంటోందని మంత్రి లోకేష్ తెలిపారు. ఏపీలో ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించేందుకు ప్రకటించిన ఎలక్ట్రానిక్స్ & సెమీ కండక్టర్ పాలసీని వివరించారు. ఏపీలోని ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల (శ్రీసిటీ, కొప్పర్తి)లో ఏఎండీ ఉత్పత్తుల అసెంబ్లింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్ యూనిట్ ఏర్పాటు చేసి, సప్లై చెయిన్‌లో భాగస్వామ్యం వహించాలని కోరారు.

ఏఎండీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వంశీ బొప్పన మాట్లాడుతూ, యూఎస్ వెలుపల భారత్‌లోనే తమకు అతిపెద్ద ఆర్ & డీ (R&D) హబ్ ఉందని తెలిపారు. ఏఐ ఆధారిత డేటా సెంటర్ ట్రాన్స్ఫర్మేషన్, నెక్స్ట్-జెన్ గేమింగ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వంశీ బొప్పన హామీ ఇచ్చారు.
ఏఎండీ సంస్థ గత ఏడాది సుమారు $27 బిలియన్ల వార్షికాదాయం సాధించింది.
