ఆంధ్రప్రదేశ్‌ను భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖామాత్యులు అనగాని సత్య ప్రసాద్ ప్రకటించారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో కీలక నిర్ణయాలు వెల్లడించారు.
రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ సమస్యలను ఏడాది కాలవ్యవధిలోగా పూర్తిగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్లకు (JCs) బాధ్యత అప్పగించారు. ఈ ఏడాది వారు రెవెన్యూ సమస్యలపైనే పనిచేస్తారు. ఖాళీగా ఉన్న 26 జిల్లాల జేసీ పోస్టులను వారం రోజుల్లో భర్తీ చేయాలని నిర్ణయం.

రీసర్వే 2.0: 2027 జనవరి నాటికి రీసర్వే 2.0 పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో జరిగిన తప్పులను ఈ ఏడాదిన్నర కాలంలో సరిదిద్దుతారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆటో మ్యూటేషన్ ప్రారంభించారు. రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఆన్‌లైన్‌లో మ్యూటేషన్ జరిగి, డాక్యుమెంట్లు రిజిస్ట్రర్ పోస్ట్‌లో భూ యజమానికి చేరేలా చర్యలు తీసుకున్నారు. కొత్త పాస్ పుస్తకాల జారీలో ఇకపై ఆలస్యం లేకుండా త్వరగా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.
22ఏ జాబితా క్లారిఫికేషన్, ప్రీహోల్డ్ భూముల సమస్యలను రెండు నెలల్లో పరిష్కారం, ఈనాం భూముల పరిష్కారానికి 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని రెవెన్యూ, ఎండోమెంట్ శాఖలకు ఆదేశం. రిజిస్ట్రేషన్ శాఖను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రక్షాళన చేయాలని, పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల వలే రిజిస్ట్రేషన్ కార్యాలయాల ఏర్పాటుపై సమాలోచనలు జరుగుతున్నాయని తెలిపారు.
