చిలకలూరిపేటలోని నాదెండ్ల మండలం, గణపవరం బైపాస్ రోడ్డు (NH-16) వద్ద డిసెంబర్ 4, 2025 రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు యువకులు మృతి చెందిన సంఘటనకు సంబంధించి పోలీసులు కీలక వివరాలను వెల్లడించారు.
నరసరావుపేట DSP. M. హనుమంత రావు తెలిపిన వివరాల ప్రకారం, ఐదుగురు ముద్దాయిలు (1. మదమంచి వెంకట అనుజ్ణ నాయుడు, 2. పుల్లంశెట్టి మహేష్, 3. బెల్లంకొండ గోపి, 4. షేక్ నది బాషా, 5 నాలి వెంకట రావు) డబ్బులు దోచుకోవాలనే దురుద్దేశంతో కారులో వచ్చి, మహేంద్ర ట్రాక్టర్ల లోడుతో వెళ్తున్న లారీని (MH40DC0889) బలవంతంగా ఆపే ప్రయత్నం చేశారు.
ముద్దాయిల సైగతో లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో, వెనుక వేగంగా వస్తున్న మృతులు ప్రయాణిస్తున్న కారు (AP40AB0688) లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ఆరుగురిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. ఇంకొకరు గాయపడ్డారు.
పల్నాడు జిల్లా S.P B.కృష్ణారావు ఆదేశాల మేరకు, నరసరావుపేట డీఎస్పీ ఎం. హనుమంత రావు సాంకేతిక ఆధారాల సాయంతో డిసెంబర్ 12, 2025న ఐదుగురు ముద్దాయిలను గుర్తించి అరెస్టు చేశారు. వారి నుండి దొంగతనానికి ఉపయోగించిన కారు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు లారీని బలవంతంగా ఆపడం, ఆ తర్వాత లారీ డ్రైవర్‌ను కూడా బెదిరించడం వంటి అంశాలను గుర్తించి, నాదెండ్ల పోలీస్ స్టేషన్‌లో Cr.No 151/2025 కింద కేసు నమోదు చేశారు.
