న్యూమిస్మాటిక్స్ (నాణేల అధ్యయనం) మరియు వారసత్వ అధ్యయనాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆకాంక్షించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగంలో ఏర్పాటు చేసిన “దక్షిణ భారతదేశ నాణాలు మరియు ఆర్థిక వ్యవస్థ” అనే జాతీయ సెమినార్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

న్యూమిస్మాటిక్స్, వారసత్వ అధ్యయనాల్లో తెలంగాణ ముందంజలో ఉండాలి. ప్రభుత్వం పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నాయకత్వంలో శాస్త్రీయ అధ్యయనం, సంస్కృతి సంరక్షణకు కట్టుబడి ఉంది. దక్షిణ భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత సమృద్ధిగా నాణేల పరంపర ఉంది. శాతవాహనులు, ఇక్ష్వాకుల వాణిజ్య నెట్‌వర్క్‌ల నుంచి కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం వరకు నాణేలు కళాత్మకత, నైపుణ్యమైన రాజ్య పాలనకు ప్రతీక.నాణెం అనేది కేవలం లోహపు ముద్ర మాత్రమే కాదు. ఇది ఆ కాలపు ఆర్థిక వ్యవస్థ, రాజు ఆశయాలు, సాంకేతికత, వాణిజ్య మార్గాలు, ధార్మిక చిహ్నాలు వంటి అంశాలను నిక్షిప్తం చేసుకున్న ‘కంప్రెస్డ్ డేటా’ లాంటిది. నాణాలను అధ్యయనం చేయడం అంటే లోహాన్ని కాదు, ఆలోచనను అధ్యయనం చేయడమే ని అభివర్ణించారు. వారసత్వ శాఖ 114 ఏళ్ల ప్రయాణంలో తొలిసారిగా నాణేలపై మాత్రమే జాతీయ సదస్సు నిర్వహించడం చారిత్రక మైలురాయి అని కొనియాడారు.

కోటిలింగలలో లభించిన ఒక శాతవాహన సీసపు నాణెం ఉజ్జయినీ చిహ్నం, బౌద్ధ కళ ముద్రలతో కూడి ఉంది. ఇది తెలంగాణ ప్రాంతం డెక్కన్ వాణిజ్య వ్యవస్థలో కీలక కేంద్రం అనే విషయాన్ని, పూర్వీకులు స్థానిక వనరులతో ఆర్థిక వ్యవస్థను నిర్మించారనే విషయాన్ని స్పష్టం చేస్తుందని వివరించారు.ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పలు న్యూమిస్మాటిక్స్, ఆర్ట్ సంబంధిత పుస్తకాలను ఆవిష్కరించారు.

