కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతూ, ‘కోనసీమ తిరుమల’గా ప్రసిద్ధి చెందిన వాడపల్లిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి శనివారం కావడంతో భక్తులు వేలాదిగా పోటెత్తారు.
ఏడు వారాల నోముతో ‘ఏడు శనివారాలు వెంకన్నను’ దర్శించుకునేందుకు భక్తులు వేకువజాము నుంచే అధిక సంఖ్యలో తరలివచ్చారు.స్వామి వారికి వెంకటేశ్వర సహిత ఐశ్వర్య లక్ష్మీ హోమం, సుప్రభాత సేవ, తొలి హారతి వంటి సేవలు నిర్వహించారు. ఎర్రచందన స్వరూపుడైన స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.
ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో మారుమోగాయి. భక్తుల రద్దీతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు మరియు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు స్వయంగా క్యూలైన్లను పరిశీలించారు. చిన్నపిల్లలు, వృద్ధులకు పాలు, బిస్కెట్లు, మంచినీటి సౌకర్యాలను కల్పించారు.
