మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) పేరును మార్చాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో, ప్రతిపక్షం ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడింది.

మహాత్మా గాంధీ పేరును తొలగించాలని చూడటంపై, ప్రధాని మోడీని ‘అభినవ గాడ్సే’ మరియు నాథూరామ్ గాడ్సేకు వారసుడిగా ప్రతిపక్షాలు అభివర్ణించాయి. అప్పుడు గాడ్సే మహాత్ముడిని భౌతికంగా హతమార్చగా, నేడు మోడీ గారు బాపూజీ పేరు, సిద్ధాంతాలను తుడిచిపెట్టి మరో హత్య చేస్తున్నారని ఆరోపించారు. ఉపాధి హామీ పథకానికి ఉన్నఫలంగా పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఈ చర్య దేశ ద్రోహపు చర్యేనని, మహాత్మా కు ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న తీరని ద్రోహం అని మండిపడ్డారు.

పథకానికి “రామ్ – జి” (రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్) పేరు పెట్టి గాంధీజీని అవమానించాలని చూసే కుట్ర జరుగుతోందని, ఇది నరేగా పథకాన్ని RSS స్కీమ్‌గా మార్చే ప్రయత్నమని విమర్శించారు. ఈ దేశద్రోహపు చర్యను దేశం మొత్తం ప్రతిఘటించాలని, రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్‌లో ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది.
