ప్రజారోగ్య పరిరక్షణ, వైద్య ఖర్చుల భారం తగ్గించడం లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ, అంతర్జాతీయ వైద్య నిపుణులతో కూడిన 10 మంది సభ్యుల బృందంతో సీఎం వర్చువల్‌గా సమావేశమయ్యారు.

‘సంజీవని’ ప్రాజెక్టు ద్వారా ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులను త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ఏడాదిలోగా ఈ రికార్డులను సిద్ధం చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. వ్యాధి బారిన పడిన తర్వాత చికిత్స కంటే, ముందుగానే నియంత్రించే ‘ప్రివెంటివ్ వెల్నెస్’ విధానాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. దీనివల్ల ప్రజలకు వైద్య ఖర్చులు తగ్గుతాయని స్పష్టం చేశారు. డిజిటల్ AIఎనేబుల్డ్ హెల్త్, హెల్త్ ఫైనాన్సింగ్ రిఫార్మ్స్పై దృష్టి పెట్టాలని, ఆరోగ్య సమస్యల పరిష్కారానికి యోగా, నేచురోపతిని ప్రోత్సహించాలని సూచించారు.

ఈ బృందంలో WHO సీనియర్ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్, UNఎయిడ్స్ డైరెక్టర్ పీటర్ పాయిట్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. పౌష్టికాహారం, వాయు కాలుష్యం నియంత్రణ, రూట్ కాజ్ అనాలసిస్, హెల్త్ ఇంటెలిజెన్స్ వినియోగం వంటి అంశాలపై కీలక సూచనలు చేశారు. నిపుణుల సలహాలను క్రోడీకరించి యాక్షన్ ప్లాన్ తయారు చేసే బాధ్యతను గేట్స్ ఫౌండేషన్ కంట్రీ డైరెక్టర్ అర్చనా వ్యాస్‌కు సీఎం అప్పగించారు. ఇకపై ఏడాదిలో రెండుసార్లు ఈ బృందంతో భేటీ కానున్నట్లు తెలిపారు.

