ఇందల్వాయి జాతీయ రహదారిపై లారీ డ్రైవర్ సల్మాన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కాల్పులు జరిపి పరారైన ఇద్దరు నిందితులను పోలీసులు గంటల వ్యవధిలోనే చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన లారీ డ్రైవర్ సల్మాన్, ఇందల్వాయి మండలం దేవితండా వద్ద గల ఒక దాబా దగ్గర తన లారీని నిలిపాడు. మంగళవారం సాయంత్రం మరో లారీలో వచ్చిన ఇద్దరు దుండగులు సల్మాన్‌తో గొడవకు దిగి, తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ దాడిలో సల్మాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాల్పుల అనంతరం నిందితులు తమ లారీని చంద్రాయన్పల్లి వద్ద వదిలేసి పరారయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన ఇందల్వాయి పోలీసులు, స్పెషల్ టీమ్స్ సహాయంతో గాలింపు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
నిందితులు కూడా ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారేనని ప్రాథమిక సమాచారం. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగిందా లేక తక్షణ గొడవ కారణమా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
