పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ (iBomma) నిర్వాహకుడు రవికి నాంపల్లి కోర్టు మరోసారి పోలీసు కస్టడీ విధించింది. మూడు వేర్వేరు కేసుల్లో ఒక్కో కేసులో 4 రోజుల చొప్పున మొత్తం 12 రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది.

ఈ నెల 18 (ఎల్లుండి) నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు రవిని కస్టడీలోకి తీసుకుని విచారణ ప్రారంభించనున్నారు. ఐబొమ్మ వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌ను ఛేదించాలంటే రవిని మరోసారి విచారించడం తప్పనిసరి అని పోలీసులు కోర్టుకు తెలిపారు. రవిని ఇప్పటికే రెండుసార్లు కస్టడీకి తీసుకున్నారని, విచారణ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని రవి తరఫు న్యాయవాది శ్రీనాథ్ వాదించినప్పటికీ కోర్టు పోలీసుల విన్నపాన్ని అంగీకరించింది.
ఈ 12 రోజుల విచారణలో ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వహణ, సర్వర్లు ఎక్కడ ఉన్నాయి, ఆర్థిక లావాదేవీలు ఎలా జరుగుతున్నాయి అనే కీలక విషయాలను రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు.
