కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పొలంలో పని చేసుకుంటున్న ఓ రైతు పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. పర్ర చివర గ్రామానికి చెందిన ఆరేవరపు వీర రాఘవయ్య (42).బుధవారం ఉదయం రాఘవయ్య తన వ్యవసాయ పొలంలో పనులు నిర్వహిస్తుండగా విషసర్పం కాటు వేసింది. గమనించిన స్థానికులు ఆయనను వెంటనే నాగాయలంక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాఘవయ్య తుదిశ్వాస విడిచారు.

కూలి పనులు చేస్తూ, వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న రాఘవయ్య మరణంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. మృతుడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
