దాంపత్య జీవితంలో పెరిగిన దూరం, ఒంటరితనం ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. హైదరాబాద్‌లోని మూసాపేట్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చందనాజ్యోతి (25) ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన చందనాజ్యోతికి, కొత్తగూడెంకు చెందిన బీ. వెంకటసాయి (యశ్వంత్) కి నాలుగు నెలల క్రితమే వివాహం జరిగింది. మూసాపేట్ అంజయ్య నగర్‌లో నివాసం ఉంటూ చందనాజ్యోతి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ‘WORK FROM HOME’ చేస్తోంది.

భర్త వెంకటసాయి మెడ్‌ప్లస్ సంస్థలో పనిచేస్తూ బిజీగా ఉండటం, ఇంటికి ఆలస్యంగా రావడం వల్ల దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. తనతో సమయం గడపడం లేదని, ఒంటరితనంతో చందనాజ్యోతి మానసిక వేదనకు గురైనట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా, మనస్తాపంతో చందనాజ్యోతి తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. ఉదయం తలుపు పగలగొట్టి చూడగా ఆమె ఫ్యాన్ హుక్కుకు బెడ్‌షీట్‌తో ఉరివేసుకుని కనిపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి విచారణ కొనసాగిస్తున్నారు.
