ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవ అనే విలువలను అందించిన ఏసుక్రీస్తు సందేశం ఎప్పటికీ మార్గదర్శకమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం విజయవాడలోని ‘ఏ ప్లస్ కన్వెన్షన్’లో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, మత పెద్దలకు శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రంలోని 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ. 5,000 చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నామని సీఎం తెలిపారు. డిసెంబర్ 2024 నుంచి నవంబర్ 2025 కాలానికి సంబంధించి రూ. 51 కోట్ల నిధులను ఈ నెల 24వ తేదీలోగా వారి ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు.క్రైస్తవ మైనారిటీల భద్రతకు, గౌరవానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి ఆర్థిక సాధికారత కోసం ఉపాధి పథకాలను పునఃప్రారంభించామని చెప్పారు.
44,812 మంది క్రైస్తవ లబ్ధిదారులకు రూ. 22 కోట్ల విలువైన సంక్షేమ ఫలాలను అందించామన్నారు. జెరూసలేం యాత్రకు వెళ్లే వారికి వార్షిక ఆదాయాన్ని బట్టి రూ. 30,000 నుండి రూ. 60,000 వరకు ఆర్థిక సాయం చేస్తున్నట్లు వెల్లడించారు. గుంటూరులో రూ. 10 కోట్లతో నిర్మిస్తున్న క్రిస్టియన్ భవనాన్ని ఈ ఏడాదిలోనే పూర్తి చేస్తామని, చర్చిల నిర్మాణానికి పెండింగ్ బకాయిలను క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు.
విద్య, వైద్య రంగాల్లో క్రైస్తవ మిషనరీలు దశాబ్దాలుగా చేస్తున్న సేవలు వెలకట్టలేనివని, ఎన్టీఆర్ వంటి గొప్ప నాయకులు కూడా మిషనరీ సంస్థల్లోనే చదువుకున్నారని గుర్తు చేశారు.
