MEDCHAL జిల్లా కొంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఒక ప్రధానోపాధ్యాయుడే విద్యార్థుల మధ్య చిచ్చు పెట్టిన ఘటన కలకలం రేపుతోంది. తన మాట వినడం లేదన్న నెపంతో ఏడో తరగతి విద్యార్థిపై పదో తరగతి విద్యార్థులతో దాడి చేయించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కొంపల్లి ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న సూర్య అనే విద్యార్థి. ప్రస్తుతం కొంపల్లి స్కూల్ హెడ్ మాస్టర్‌గా ఉంటూ, దుండిగల్ ఇన్-ఛార్జ్ MEOగా విధులు నిర్వహిస్తున్న కృష్ణ అనే వ్యక్తి.. సూర్య తన మాట వినడం లేదని కక్షగట్టారు. ఈ క్రమంలో అదే స్కూల్‌కు చెందిన 10వ తరగతి విద్యార్థులను ఉసిగొల్పి సూర్యను తీవ్రంగా కొట్టించినట్లు తెలుస్తోంది. బాధితుడు సూర్య తండ్రి శివ రామకృష్ణ ఈ దారుణంపై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విద్యార్థి తండ్రి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒక విద్యాధికారి హోదాలో ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
