పల్నాడు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండలో విషాదం నెలకొంది. గత 13 ఏళ్లుగా దేవస్థానంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న నాసరయ్య గుండెపోటుతో కన్నుమూశారు. అయితే, ఆయన మృతికి అధికారుల వేధింపులే కారణమంటూ కుటుంబ సభ్యులు, అర్చకులు ఆరోపించడం సంచలనంగా మారింది. విధుల్లో ఉన్న నాసరయ్యకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో, చికిత్స నిమిత్తం కోటప్పకొండ నుండి నరసరావుపేట ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచారు.

గత నాలుగు నెలల నుండి ఈఓ (EO) తన భర్తను తీవ్రంగా వేధిస్తున్నారని నాసరయ్య భార్య కన్నీటిపర్యంతమయ్యారు. ఇటీవల సరిగా పనిచేయడం లేదనే నెపంతో ఈఓ మెమో జారీ చేశారని, ఆ మానసిక ఒత్తిడి వల్లే ఆయనకు గుండెపోటు వచ్చిందని ఆమె ఆరోపించారు. నాసరయ్య మృతిపై ఆలయ అర్చకులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈఓ చంద్రశేఖర్, సూపరింటెండెంట్ శ్రీను కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారని, డబ్బుల కోసం అర్చక పోస్టులను అమ్ముకుంటున్నారని వారు బహిరంగంగా ఆరోపించారు. ఉద్యోగులను, అర్చకులను వేధింపులకు గురిచేస్తున్న ఈఓ మరియు సూపరింటెండెంట్‌లను తక్షణమే బదిలీ చేయాలని, నాసరయ్య కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
