రక్షక భట నిలయంలోనే ఒక అధికారి తోటి సిబ్బందికి భారీగా నామం పెట్టిన ఘటన విశాఖలో సంచలనం రేపుతోంది. అధిక వడ్డీ ఆశ చూపించి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిన ట్రాఫిక్ ఏఎస్ఐ ఎం.ఎన్.రాజుపై గాజువాక పోలీసులు కేసు నమోదు చేశారు.

గాజువాక ట్రాఫిక్ విభాగంలో ఏఎస్ఐగా పనిచేస్తున్న ఎం.ఎన్.రాజు, తనతో పాటు పనిచేసే తోటి పోలీస్ ఉద్యోగులనే లక్ష్యంగా చేసుకున్నారు. బయట ఇచ్చే వడ్డీ కంటే ఎక్కువ వడ్డీ ఇప్పిస్తానని నమ్మించి వారి వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోవడం, ఏఎస్ఐ రాజు నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో బాధితులు నగర పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుపై స్పందించిన సీపీ ఆదేశాల మేరకు గాజువాక పోలీసులు ఏఎస్ఐ రాజుపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విధి నిర్వహణలో ఉంటూ తోటి సిబ్బందిని మోసం చేసినందుకు గాను సదరు ఏఎస్ఐపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది.
.
