అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం సోంపల్లిలో ఏడేళ్ల క్రితం జరిగిన సంచలన హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. సుదీర్ఘ దర్యాప్తు అనంతరం ఈ కేసులో కీలక నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు. ఏడేళ్ల కిందట సోంపల్లిలో కొప్పాడి వీర రాఘవులు అనే వ్యక్తిని శ్రీనివాస్, శ్రీను, మరియు పల్లపురాజు అనే ముగ్గురు వ్యక్తులు బీరు బాటిళ్లతో కొట్టి అత్యంత దారుణంగా హత్య చేశారు.
జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ పర్యవేక్షణలో రెండు ప్రత్యేక టీమ్‌లు ఈ కేసుపై లోతైన దర్యాప్తు చేపట్టాయి. పరారీలో ఉన్న నిందితులను పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు నిందితుల్లో పల్లపురాజు ఇప్పటికే చనిపోగా, మిగిలిన ఇద్దరు నిందితులు శ్రీనివాస్ మరియు శ్రీనులను అరెస్ట్ చేసినట్లు రాజోలు సీఐ నరేష్ కుమార్ వెల్లడించారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసును పట్టుదలతో ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా ఉన్నతాధికారులు అభినందించారు.
