షెడ్యూల్డ్ ప్రాంతాల్లో పెసా (PESA) చట్టం-1996 అమలుపై అవగాహన పెంపొందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘పెసా మహోత్సవ్’ రెండో రోజు వేడుకలు విశాఖపట్నం పోర్టు స్టేడియంలో అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గిరిజన సంస్కృతి, సంప్రదాయాల ప్రదర్శన (Exhibition Stalls) అందరినీ ఆకట్టుకుంది.

కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్, ఏపీ పంచాయతీ రాజ్ శాఖ ప్రధాన కార్యదర్శి శశి భూషణ్ కుమార్ తదితర ఉన్నతాధికారులు స్టాళ్లను సందర్శించారు. గిరిజన ఉత్పత్తులు, వారి సంప్రదాయ కళాఖండాలను ఆసక్తిగా పరిశీలించి, గిరిజన కళాకారులతో ముచ్చటించారు.

10 రాష్ట్రాల నుంచి వచ్చిన గిరిజన ప్రతినిధులు ఏర్పాటు చేసిన సుమారు 200కు పైగా స్టాళ్లు ఇక్కడ కొలువుదీరాయి. ఏటికొప్పాక బొమ్మలు, మంగళగిరి చీరలు, గిరిజన వంటకాలు మరియు హస్తకళలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

పెసా చట్టం ద్వారా గిరిజనులకు సంక్రమించే హక్కులు, గ్రామసభల ప్రాధాన్యతను వివరించేలా ఏర్పాటు చేసిన విజువల్స్ మరియు ఇన్ఫోగ్రాఫిక్స్ అధికారుల ప్రశంసలు పొందాయి. పాల్గొన్న అధికారులు: ఈ కార్యక్రమంలో కేంద్ర జాయింట్ సెక్రటరీ ముక్తా శేఖర్, రాష్ట్ర కమిషనర్లు కృష్ణతేజ, రేవు ముత్యాలరాజు, కలెక్టర్లు హరేంధిర ప్రసాద్, దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
