జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (DCCB) స్థాపించి 89 ఏళ్లు పూర్తి చేసుకుని 90వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా ప్రవేశపెట్టిన ‘నవతి ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని’ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. నిమ్మాడలోని తన క్యాంప్ కార్యాలయంలో డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణతో కలిసి ఈ పథకానికి శ్రీకారం చుట్టారు.

ఈ పథకం కింద 900 రోజుల కాలపరిమితికి గాను సీనియర్ సిటిజన్లకు 9 శాతం, ఇతరులకు 8.5 శాతం గరిష్ట వడ్డీని బ్యాంకు చెల్లించనుంది.89 ఏళ్లుగా డీసీసీబీ ఖాతాదారులకు అందిస్తున్న సేవలు అభినందనీయమని మంత్రి కొనియాడారు. ప్రజలు, రైతులు ఈ అధిక వడ్డీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, రుణాల మంజూరులో బ్యాంకులు ఎటువంటి ఆలస్యం చేయకుండా పారదర్శకంగా పనిచేయాలని మంత్రి సూచించారు.
