సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉంటూనే డ్రగ్స్ వ్యాపారంలోకి దిగిన ఓ యువతిని, ఆమె ప్రియుడిని హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (H-NEW) మరియు చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. స్నేహితులతో కలిసి గుట్టుచప్పుడు కాకుండా వీరు నగరంలో మాదకద్రవ్యాలను విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సుస్మితా దేవి అలియాస్ లిల్లీ (21) అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్‌తో పాటు ఆమె ప్రియుడు, ఈవెంట్ మేనేజర్ ఉమ్మిడి ఇమ్మాన్యుయేల్ (25)ను పోలీసులు ప్రధాన నిందితులుగా గుర్తించారు. వీరితో పాటు సాయి కుమార్, తారక లక్ష్మీకాంత్ అనే మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు.

వీరి వద్ద నుండి 22 గ్రాముల హైడ్రోపోనిక్ గంజాయి, 5 గ్రాముల MDMA, 6 LSD బ్లాట్లు మరియు ఎక్స్టసీ పిల్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ. 3 లక్షలు ఉంటుందని అంచనా. ఈ ముఠా సామాజిక మాధ్యమాల ద్వారా యువతను, విద్యార్థులను ఆకర్షించి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుల వద్ద నుండి రూ. 50,000 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లను కూడా సీజ్ చేశారు.
