జిల్లాలోని నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు తెల్లవారుజామున పెను ప్రమాదం చోటుచేసుకుంది. కొమ్మినేని కోల్డ్ స్టోరేజ్ సమీపంలోని జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ముందు వెళ్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడవగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు హైవే పెట్రోలింగ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఎస్పీ స్వయంగా సంఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.
భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాతీయ రహదారిపై ప్రమాద హెచ్చరిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై నల్లపాడు సీఐ వంశీధర్ నుండి వివరాలు సేకరించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు ఎస్బి డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్బి సీఐ అలహరి శ్రీనివాస్, నల్లపాడు సీఐ వంశీధర్ తదితరులు పాల్గొన్నారు.
