నేటి యువత, బాలలు పాశ్చాత్య సంస్కృతిలోని సూపర్ హీరోల కంటే మన భారతీయ పురాణ పురుషుల గొప్పతనాన్ని తెలుసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. తిరుపతిలో జరిగిన ఒక సభలో ఆయన ప్రసంగిస్తూ, మన ఇతిహాసాలలోని విలువలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ వంటి హాలీవుడ్ క్యారెక్టర్ల కంటే మన హనుమంతుడు బలవంతుడని, అర్జునుడు గొప్ప యోధుడని పిల్లలకు వివరించాలి. అవతార్ సినిమా కంటే మన రామాయణ, భారతాలు గొప్పవని ఆయన పేర్కొన్నారు. రాముడి వంటి పురుషోత్తముడి గురించి, రామరాజ్యం గురించి చెప్పాలి. అలాగే కంసమామ, బకాసురుడు వంటి రాక్షసుల గురించి చెబితేనే పిల్లలకు మంచికి, చెడుకు ఉన్న వ్యత్యాసం తెలుస్తుందని వివరించారు.
ప్రజలు పురాణాలను మర్చిపోతున్న తరుణంలో ఎన్టీఆర్ సినిమాల ద్వారా వాటిని మళ్ళీ గుర్తు చేశారని, రాజకీయాల్లోనూ విలువలు పాటించిన మహానాయకుడు ఆయనేనని కొనియాడారు. వాజ్పేయి వేసిన పునాదులతో, ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, త్వరలోనే దేశం ప్రపంచ ‘సూపర్ పవర్’గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
