అధికార పార్టీ అండ చూసుకుని బరితెగించిన ఒక రాజకీయ నాయకుడికి బాన్సువాడలో దిమ్మతిరిగే షాక్ తగిలింది. వివాహితపై వేధింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత ఏనుగు రవీందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు దేవేందర్ రెడ్డిని బాధితురాలి భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని దేహశుద్ధి చేశారు.

దేవేందర్ రెడ్డి గత కొద్దిరోజులుగా ఒక వివాహితను ఫోన్లలో, బయట తీవ్రంగా వేధిస్తున్నాడు. నిందితుడి టార్చర్ భరించలేకపోయిన బాధితురాలు తన భర్తకు విషయాన్ని వివరించింది. ఒక ప్రైవేట్ ఆసుపత్రి ప్రాంగణంలో భార్యను వేధిస్తుండగా భర్త అతన్ని పట్టుకున్నాడు. ఆగ్రహం తట్టుకోలేక అక్కడే దేవేందర్ రెడ్డిని చెప్పుతో కొట్టి, నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. నిందితుడిని నడిరోడ్డుపై కొడుతూ తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పట్టపగలే జరిగిన ఈ ఘటన బాన్సువాడ పట్టణంలో తీవ్ర కలకలం రేపింది. అధికార పార్టీ నేత అని చెప్పుకుంటూ మహిళలపై అనుచితంగా ప్రవర్తించడంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
