ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఈ చర్య పేద విద్యార్థులకు, సామాన్య ప్రజలకు తీరని అన్యాయం చేస్తుందని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ కాలేజీలను పీపీపీ మోడల్లో ప్రైవేటీకరిస్తే, వైద్య విద్యా ఖర్చులు భారీగా పెరుగుతాయని, పేద విద్యార్థులు డాక్టర్లు అయ్యే అవకాశం కోల్పోతారని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ప్రకటించిన నోటిఫికేషన్లకు బిడ్లు రాకపోవడంపై స్పందిస్తూ స్పష్టత లేని విధానాల వల్ల ప్రైవేట్ సంస్థలు వెనకాడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వమే కావాలని ఈ ప్రక్రియను క్లిష్టతరం చేస్తూ, చివరికి తమకు కావాల్సిన వారికి తక్కువ ధరకే ఈ కాలేజీలను అప్పగించే ప్లాన్ చేస్తోందని జగన్ ఆరోపించారు. ప్రభుత్వం నిర్మించిన 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలని, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను నిర్వీర్యం చేయవద్దని ఆయన డిమాండ్ చేశారు.
