రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తాతయ్య గుంట గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ కమిటీ చైర్మన్ మహేష్ యాదవ్, బోర్డు సభ్యులు మరియు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.

అమ్మవారిని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని మంత్రి అనిత తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నప్పుడు కలిగే ఆధ్యాత్మిక అనుభూతి ఇక్కడ కూడా కలిగిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

గంగమ్మ జాతర ప్రాముఖ్యత మరియు విశిష్టత గురించి ఆలయ అర్చకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమెకు అమ్మవారి శేషవస్త్రం మరియు తీర్థప్రసాదాలను అందజేశారు. మంత్రి వెంట శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, శాప్ (SAP) చైర్మన్ రవి నాయుడు, ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ మరియు ఇతర కూటమి నాయకులు ఉన్నారు.
