World :Putin నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి? ట్రంప్ ఆగ్రహం

December 30, 2025 11:14 AM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ భారీ స్థాయిలో డ్రోన్ దాడులకు పాల్పడిందన్న వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపాయి. ఈ పరిణామంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, ఉక్రెయిన్ ఈ ఆరోపణలను పచ్చి అబద్ధాలని కొట్టిపారేసింది.

రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ కథనం ప్రకారం.. డిసెంబర్ 28-29 తేదీల మధ్య మాస్కోకు పశ్చిమాన ఉన్న నొవ్‌గోరోడ్ ప్రాంతంలోని పుతిన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ 91 లాంగ్-రేంజ్ డ్రోన్లను ప్రయోగించింది. రష్యా గగనతల రక్షణ వ్యవస్థలు వాటన్నింటినీ కూల్చివేసినట్లు ఆయన తెలిపారు.

ట్రంప్‌కు పుతిన్ ఫోన్: సోమవారం ఉదయాన్నే పుతిన్ స్వయంగా తనకు ఫోన్ చేసి ఈ దాడి విషయం చెప్పారని ట్రంప్ వెల్లడించారు. “ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం వేరు, కానీ ఏకంగా నివాసంపై దాడి చేయడం సరికాదు. దీనిపై నాకు చాలా కోపంగా ఉంది” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే, ఈ దాడి నిజంగా జరగలేదని కొందరు అంటున్నారని, దీనిపై తాము ఆరా తీస్తామని ఆయన పేర్కొన్నారు.

ఈ ఆరోపణలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా ఖండించారు. అమెరికాతో జరుగుతున్న శాంతి చర్చలను దెబ్బతీసేందుకు, ఉక్రెయిన్‌పై మరిన్ని దాడులు చేయడానికి రష్యా అల్లుతున్న కట్టుకథలివని ఆయన విమర్శించారు. ఈ దాడి నేపథ్యంలో ఉక్రెయిన్‌తో శాంతి చర్చల విషయంలో తమ వైఖరిని పునఃసమీక్షిస్తామని రష్యా హెచ్చరించింది. అయినప్పటికీ, పుతిన్‌తో తన చర్చలు ఫలప్రదంగా సాగాయని, యుద్ధం ముగిసే ఒప్పందానికి తాము చాలా దగ్గరగా ఉన్నామని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media