వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కడప జిల్లా జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల సందడితో కళకళలాడింది. తెల్లవారుజామున 1:30 గంటల నుండే స్వామివారి దర్శన భాగ్యం కల్పించడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఆలయ నిర్వాహకులు ప్రత్యేకంగా వైకుంఠ ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేసి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి దర్శనం కల్పించారు.
ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశిని స్వర్గ ద్వార ఏకాదశి అని కూడా పిలుస్తారని ఆలయ పూజారి రాజేష్ తెలిపారు. ఈ రోజున మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారని పురాణ గాథ.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వర రావు పర్యవేక్షణలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకునేలా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది.

