రాప్తాడు కొత్త ఏడాది వేడుకలు జరుపుకోవాల్సిన సమయంలో అనంతపురం జిల్లాలో పెను విషాదం నెలకొంది. రాప్తాడు మండలం పరిధిలోని హార్మోనీ సిటీలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో విద్యుదాఘాతంతో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
మృతుడిని అనంతపురం నగరం వేణుగోపాల్ నగర్‌కు చెందిన షౌకత్ (24) గా గుర్తించారు. బుధవారం సాయంత్రం వేదిక వద్ద లైటింగ్ మరియు మైక్ పనులు చేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ షాక్ తగిలి షౌకత్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించే క్రమంలోనే అతను మృతి చెందాడు. ఒక నిండు ప్రాణం పోయినా, ఏమీ జరగనట్లుగా నిర్వాహకులు ఈవెంట్‌ను అలాగే కొనసాగించడం తీవ్ర చర్చనీయాంశమైంది. మానవత్వం లేకుండా వేడుకలు జరపడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

షౌకత్ మృతికి నిరసనగా అతని కుటుంబ సభ్యులు, సహచర కార్మికులు మృతదేహంతో ఈవెంట్ ప్రాంగణం వద్దే ధర్నాకు దిగారు. మృతదేహాన్ని వేదికపైకి తీసుకెళ్లేందుకు వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ భారీ ఈవెంట్‌కు పోలీసు, అగ్నిమాపక శాఖల నుండి కనీస అనుమతులు తీసుకోలేదని సమాచారం. సింగర్ మంగ్లీ, పలువురు సెలబ్రిటీలతో ఈ ఈవెంట్‌ను నిర్వహించారు.
