భీమిలి నియోజకవర్గం తగరపువలసలోని అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి సాంకేతిక ఉత్సవం “గ్యాన్ 2కె25 (Gyan 2k25)” అంగరంగ వైభవంగా ముగిసింది. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ టెక్ ఫెస్ట్ సందడిగా సాగింది.

పద్మభూషణ్ అవార్డు గ్రహీత, మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు నూతన సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలని యార్లగడ్డ సూచించారు. ఇటువంటి వైజ్ఞానిక ప్రదర్శనలు మేధోసంపత్తిని పెంచుతాయని కొనియాడారు.

అవంతి కళాశాలల చైర్మన్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రయోగాలు, పరిశోధనలపై దృష్టి పెట్టాలని, ఆధునిక సాంకేతికతతోనే మంచి భవిష్యత్తు సాధ్యమని దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, సాంకేతిక ప్రాజెక్టులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

