అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో భారీ ఎత్తున నిరసన ర్యాలీ జరిగింది. శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లిం ఐక్య వేదిక ఆధ్వర్యంలో వేలాది మంది మైనారిటీలు ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గళమెత్తారు.

స్థానిక ఠానా సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ఈ భారీ ర్యాలీ సాగింది. “జస్టిస్ ఫర్ రాయచోటి” అంటూ ఆందోళనకారులు చేసిన నినాదాలతో పట్టణం మారుమోగింది.”ప్రభుత్వాలు మారితే అభివృద్ధి జరగాలి కానీ, ఉన్న జిల్లా కేంద్రాన్ని నామరూపాల్లేకుండా ఎలా చేస్తారు?” అని ఆందోళనకారులు ప్రశ్నించారు. మైనారిటీ సంఘాలు, స్థానిక ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రం తరలిపోతే రాయచోటి ఆర్థికంగా, పరిపాలనాపరంగా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లా కేంద్రాన్ని రాయచోటిలోనే యధాతధంగా కొనసాగించే వరకు తమ పోరాటం ఆగదని, రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
