మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ (PLGA) బెటాలియన్-1 కమాండర్, మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అగ్రనేత బర్సే దేవా అలియాస్ సుక్కా శుక్రవారం తెలంగాణ డీజీపీ జితేందర్ (శివధర్ రెడ్డి) ముందు లొంగిపోయారు. ఆయనతో పాటు మరో 15 మంది మిలిటరీ ఆపరేషన్ సభ్యులు కూడా జనజీవన స్రవంతిలో కలిశారు.
మావోయిస్టు అగ్రనేత మాడ్వి హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత, పార్టీ సాయుధ బలగాల (PLGA) బాధ్యతలను బర్సే దేవా నిర్వహిస్తున్నారు. హిడ్మా, బర్సే దేవా ఇద్దరూ ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందినవారు.లొంగుబాటు సమయంలో దేవా నుంచి అత్యంత శక్తివంతమైన మౌంటెన్ ఎల్.ఎం.జి (LMG) తుపాకీని మరియు ఇతర మత్తు పదార్థాలు, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బర్సే దేవాపై ప్రభుత్వం ₹50 లక్షల రివార్డు ప్రకటించింది. మావోయిస్టు పార్టీకి ఆయుధాల సరఫరాలో ఆయన కీలక పాత్ర పోషించేవారు.శనివారం (జనవరి 3) బర్సే దేవాను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా డీజీపీ లొంగుబాటుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.
