ఆంధ్రప్రదేశ్‌ను రైల్వే గేట్ల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం భారీ కార్యాచరణను సిద్ధం చేసింది. ప్రమాదాల నివారణ మరియు రవాణా సౌలభ్యం కోసం అన్ని రైల్వే గేట్ల స్థానంలో ఓవర్ బ్రిడ్జిలు (ROB), అండర్ బ్రిడ్జిల (RUB) నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారులను ఆదేశించారు. రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం రైల్వే శాఖతో కలిసి ఆర్అండ్బీ, మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ సూచించారు.

ఫిబ్రవరి 10వ తేదీలోగా రాష్ట్రవ్యాప్తంగా ‘యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే’ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్లకు స్పష్టమైన గడువు విధించారు. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహిస్తూ రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని, వ్యవసాయ సహాయకులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
