ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు కొండగట్టు ఆంజనేయ క్షేత్రాన్ని సందర్శించనున్నారు. టీటీడీ మంజూరు చేసిన ₹35.19 కోట్ల నిధులతో సత్రం, దీక్ష విరమణ మండప నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. అనంతరం తెలంగాణ జనసేన శ్రేణులతో సమావేశం కానున్నారు.
మొత్తం ₹35.19 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన సత్రం, దీక్ష విరమణ మండపానికి పవన్ కళ్యాణ్ భూమిపూజ చేస్తారు. పవన్ కళ్యాణ్ చొరవ, ఏపీ సీఎం చంద్రబాబు సానుకూలతతో టీటీడీ బోర్డు ఈ నిధులను మంజూరు చేసింది. ఒకేసారి 2 వేల మంది భక్తులు దీక్ష విరమించేలా భారీ మండపం, అలాగే 96 గదులతో కూడిన అత్యాధునిక సత్రాన్ని నిర్మించనున్నారు. ఉదయం 10:30 నుంచి 11:30 వరకు ఆలయ దర్శనం, శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయి. ఈ వేడుకలో టీటీడీ ఛైర్మన్ సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.
శంకుస్థాపన అనంతరం కొడిమ్యాల సమీపంలోని బృందావనం రిసార్ట్‌లో తెలంగాణ జనసేన నాయకులు, కార్యకర్తలతో పవన్ సమావేశమవుతారు. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచిన అభ్యర్థులతో ఆయన ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
