విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల సమస్యలు మరోసారి రోడ్డుపైకి వచ్చాయి. తమకు ఉపాధి కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిర్వాసితులు చేపట్టిన నిరసన గాజువాకలో ఉద్రిక్తతకు దారితీసింది.తమ గోడును ప్రభుత్వానికి వినిపించేందుకు నిర్వాసితులు ‘భిక్షాటన’ నిరసన చేపట్టాలని నిర్ణయించారు. అయితే, పోలీసులు ఈ కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు.భిక్షాటనకు అనుమతి లేకపోవడంతో ఆగ్రహించిన వందలాది మంది నిర్వాసితులు భారీగా గాజువాకలోని లంకా గ్రౌండ్కు చేరుకున్నారు. అక్కడే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నిర్వాసితుల ఆందోళనతో గాజువాక ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. నిర్వాసితులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించడంతో తోపులాట చోటుచేసుకుంది. స్టీల్ ప్లాంట్ కోసం భూములు త్యాగం చేసిన తమకు దశాబ్దాలు గడుస్తున్నా పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని, తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
