అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సెజ్ (SEZ) పరిధిలోని ఎస్వీఎస్ (SVS) కెమికల్స్ కంపెనీలో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కంపెనీ ఆవరణలో నిల్వ ఉంచిన సాల్వెంట్ ఆయిల్ డ్రమ్ములు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా పేలడంతో ఆ ప్రాంతమంతా యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది.కెమికల్ ప్లాంట్‌లో నిల్వ ఉంచిన ఆయిల్ పీపాలు (Solvent Oil Drums) వేడికి భారీ శబ్దంతో పేలుతున్నాయి. దీనివల్ల మంటలు వేగంగా కంపెనీ అంతటా విస్తరిస్తున్నాయి. భారీగా ఎగసిపడుతున్న మంటల కారణంగా ఆకాశమంతా నల్లటి పొగ కమ్మేసింది. కిలోమీటర్ల దూరం వరకు ఈ పొగ కనిపిస్తుండటంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో కంపెనీలోని యంత్రాలు, కెమికల్ నిల్వలు పూర్తిగా దగ్ధమవుతున్నాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పలు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. ప్రాణనష్టంపై ఇంకా అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.
