జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో బుధవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కళాశాల యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. అద్దె భవనంలో కనీస సౌకర్యాలు లేక నరకం చూస్తున్నామని, వెంటనే సొంత భవనంలోకి తరలించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థినుల నిరసనను అడ్డుకునేందుకు యాజమాన్యం కళాశాల గేట్లకు తాళం వేసి వారిని నిర్బంధించింది. దీనితో విద్యార్థినుల ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆగ్రహంతో గేట్లను బద్దలు కొట్టుకుంటూ బయటకు వచ్చి రోడ్డుపై బైఠాయించారు. యాజమాన్యం బెదిరింపులకు భయపడేది లేదని, తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపమని విద్యార్థినులు స్పష్టం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
